జాతి వివక్ష తదితర సామాజిక దౌష్ట్యాలకు వ్యతిరేకంగా పోరాడిన బ్రియర్లీ క్రికెట్ రంగంలో నైతికత, న్యాయం గురించి ప్రగాఢంగా ఆలోచించిన వివేచనాశీలి. ఇప్పుడు సజీవులుగా ఉన్న టెస్ట్ క్రికెటర్లు అందరిలోనూ బ్రియర్లీ అత్యంత వివేకవంతుడు. క్రికెట్ ఆడడంలో వైఫల్యాలు నేర్పిన పాఠాలు, మానవతాపూర్వక అవగాహన, క్రికెట్ వెలుపలి విశాలజీవితపు అనుభవాలు స్ఫూర్తిదాయక ‘ఆన్ క్రికెట్’ రచనకు బ్రియర్లీను పురిగొల్పాయి.
ఇంగ్లాండ్ క్రికెట్ మాజీ కెప్టెన్ జాన్ మైఖేల్ బ్రియర్లీ (జననం 1942) ఒక విశిష్ట వ్యక్తి. ‘ప్రజలలో బ్రియర్లీకి ఒక ఉన్నత స్థానమున్నద’ని ఆయన గురించి ఆస్ట్రేలియన్ ఫాస్ట్ బౌలర్ రాడ్నే హాగ్ వ్యాఖ్యానించారు. క్రికెట్ జీవితం నుంచి ఇరువురూ నిష్క్రమించిన చాలా కాలం తరువాత రాడ్నే హాగ్ తాను నిర్వహిస్తున్న ఒక రేడియో కార్యక్రమానికి బ్రియర్లీను ఆహ్వానించారు. బ్రియర్లీ తన ఫస్ట్ క్లాస్ క్రికెట్ జీవితాన్ని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో వికెట్ కీపర్‌గా ప్రారంభించారని తెలుసుకున్న రాడ్నే హాగ్ ఆ రేడియో కార్యక్రమంలో తన అతిథిని వికెట్ కీపింగ్‌కు ఎందుకు స్వస్తి చెప్పారని ప్రశ్నించారు. ‘వికెట్ కీపింగ్‌లో నేనేమంత నేర్పు గలవాడిని కానని’ ఆ ఆంగ్లేయుడు సమాధానమిచ్చాడు. ‘మరి మీరు బ్యాటింగ్‌ను కొనసాగించారు గదా’ అని ఆ ఆస్ట్రేలియన్ ప్రతిస్పందించారు. ఆసక్తికరమైన ఈ ఉదంతం గురించి మైక్ బ్రియర్లీ తన కొత్త పుస్తకం ‘ఆన్ క్రికెట్’లో రాశారు. క్రికెట్ ప్రముఖులకు నివాళులు, సహచర క్రికెటర్ల స్నేహ స్మృతులు, విశాల జీవిత వాస్తవాల గురించిన ఆలోచనాత్మాక వ్యాసాల సంకలనమది. బాల్య, కౌమార దశల్లో తనకు హీరోలు అయిన లెన్ హట్టన్, డెనిస్ కాంప్టన్‌లకు ప్రణామాలతో ప్రారంభమైన ఈ పుస్తకంలో తన సమకాలీన మహోన్నత క్రికెటర్ల గురించి; అవినీతి, వంచన గురించి; వికెట్ కీపర్లు, భారతీయ వ్యాపారుల గురించి; జాతి వివక్ష గురించి బ్రియర్లీ తన కొత్త పుస్తకంలో విపులంగా రాశారు. తన క్రికెట్ జీవితంలో బ్రియర్లీ గొప్ప కెప్టెన్‌గా సుప్రసిద్ధుడయ్యారు. అయితే బ్యాట్స్‌మన్‌గా ఆయన ఒక సాధారణ క్రీడాకారుడు మాత్రమే. టెస్ట్ క్రికెట్ నుంచి నిష్క్రమించిన చాలా కాలం తరువాత కూడా ఆ సుప్రసిద్ధ ఆట గురించి ప్రగాఢ అభినివేశంతో ఆలోచించడాన్ని బ్రియర్లీ కొనసాగించారని ఆయన కొత్త పుస్తకం విశదం చేసింది. విశ్వవిద్యాలయంలో తత్వశాస్త్ర విద్యార్థి అయిన బ్రియర్లీ వాస్తవ జీవితంలో మనో వైజ్ఞానికుడు కూడా. బ్రిటిష్ సైకోఎనలిటికల్ సొసైటీకి ఆయన ప్రస్తుతం అధ్యక్షుడుగా ఉన్నారు. బౌండరీకి ఆవల జీవితం గురించి కూడా బ్రేయర్లేకు విస్తృత పరిజ్ఞానం, లోతైన అవగాహన ఉన్నది. ‘ఆన్ క్రికెట్’లోని 49 వ్యాసాలూ సహానుభూతి, అవగాహన, జ్ఞాన వివేకాలతో పాటు తరచు తనను తాను తక్కువచేసి మాట్లాడుకున్న హాస్యస్ఫూర్తిని నిండుగా ప్రతిబింబించాయి. తన కాలపు వెస్టిండీస్ క్రికెట్ ప్రముఖుల గురించి ఎంతో గౌరవాదరాలు, ప్రేమాభిమానాలతో బ్రియర్లీ రాశారు. ‘ఆన్ క్రికెట్’ చదువుతుంటే వికెట్‌కు, క్రీడాకారులకు అనుక్షణ ముప్పుగా ఆడిన ఫాస్ట్ బౌలర్లు క్రికెట్ నుంచి అదృశ్యమయ్యారనే భావన కలిగింది. లిల్లీ లేదా థామ్సన్, హోల్డింగ్ లేదా రాబర్ట్స్, వకార్ లేదా షోయబ్‌ల వలే బ్యాట్స్‌మన్‌ను భయాందోళనల్లో ముంచెత్తివేసే బౌలింగ్ చేసే క్రికెటర్లు ఇప్పుడు ఒక్కరూ లేనని కచ్చితంగా చెప్పవచ్చు.తన కాలం అనంతరం క్రికెట్‌లో రాణించిన పలువురు ఆటగాళ్ళ గురించి కూడా బ్రియర్లీ చాలా సముచితంగా రాశారు. శ్రీలంక బ్యాట్స్‌మన్‌లో సార్వకాలిక గొప్పవాడుగా సుప్రసిద్ధుడైన సంగక్కర ప్రతిభా పాటవాల గురించి ఇలా రాశారు: ‘సంగక్కర తన జట్టు బ్యాటింగ్ విజయానికి కీలక వ్యక్తి. కొన్ని సందర్భాలలో శ్రీలంక జట్టు విజయం పూర్తిగా బ్యాటింగ్ ప్రతిభపై ఆధారపడి వుండేది. సంగక్కర మంచి అధ్యయనపరుడు, పరిశీలకుడు. దృఢకాయుడైన సంగక్కర బ్యాట్‌పై బ్యాల్ ఒక విలక్షణ శబ్దాన్ని జనింపచేసేది. అతని బ్యాటింగ్‌లో సౌందర్య సౌష్ఠవం నిండుగా వుండేది’. మైక్ బ్రియర్లీకి భారతదేశంతో సుదీర్ఘ, సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆయన సతీమణి భారతీయురాలు. 1978–77లో భారత్‌లో ఎమ్‌సిసి పర్యటన సందర్భంగా అహ్మదాబాద్‌లో వాస్తు శిల్పి, డిజైనర్ మానా సారాభాయితో ఆయనకు పరిచయమయింది. ఆ పరిచయం అనతికాలంలోనే వివాహ బంధంగా పరిణమించింది. సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీతో సహా పలువురు భారతీయ బ్యాట్స్‌మన్ గురించి ‘ఆన్ క్రికెట్’లో పలు వ్యాసాలు ఉన్నాయి. ప్రస్తుతం విశ్రాంత జీవితంలో ఉన్న ఆనాటి భారతీయ క్రికెట్ కెప్టెన్ బిషన్ సింగ్ బేడీ గురించి బ్రియర్లీ చాలా స్ఫూర్తి దాయకమైన పదచిత్రాన్ని రాశారు. ‘బేడీ బౌలింగ్ చాలా మనోహరంగా ఉంటుందని’ బ్రియర్లీ అన్నారు. ‘క్రికెట్ మైదానం వెలుపల బేడీ చాలా ఉదార వ్యక్తి’ అని ఆ ఆంగ్లేయుడు కితాబు నిచ్చారు. మైక్ బ్రియర్లీ ‘ఆన్ క్రికెట్’ చదువుతూ నేను చాలా తెలుసుకున్నాను. తొలి పేజీ నుంచి తుది పుట వరకు ఎంతో స్ఫూర్తిదాయకమైన పఠనమది. తెలుసుకున్న విషయాలను మరింత విపులంగా తెలుసుకునేలా అది నన్ను పురిగొల్పింది. అయితే అందులో రెండు తప్పులు లేకపోలేదు. వాటిలో ఒకటి సయద్ కిర్మానీ గురించిన వ్యాఖ్య ఒకటి. ఇది పూర్తిగా ఉపేక్షణీయమైనది. రెండోది సామాజికమైనది. దీన్ని వివరంగా చూద్దాం. ముత్తయ్య మరళీథరన్ క్రీడానైపుణ్యం గురించి చాలా లోతైన అవగాహనతో రాసిన బ్రియర్లీ ఆయన శ్రీలంక తమిళ మైనారిటీ వర్గానికి చెందిన వాడన్న విషయాన్ని ప్రస్తావించడాన్ని మరచి పోయాడు. శ్రీలంకలో తమిళులు, సింహళీయల మధ్య అంతర్యుద్ధ నేపథ్యంలోనే మురళి గొప్ప క్రికెట్ విజయాలు సాధించారు. బ్రియర్లీ ఎందుకనో ఈ వాస్తవాన్ని విస్మరించారు. జాతి వివక్ష గురించి రాసిన వ్యాసాలలో మైక్ బ్రియర్లీ వివేకం ప్రత్యేకంగా ప్రస్ఫుటమయింది. ఒక సందర్భంలో బ్రియర్లీ ఇలా రాశారు: ‘బాధితులు ముఖ్యంగా సామాజిక దౌష్ట్యాలకు గురయ్యేవారు అతిగా ప్రతిస్పందిస్తుంటారు. రాజకీయంగా ఆక్షేపణీయం కాని వైఖరులను అనుసరించడం బాధితులకు సులువుగా సాధ్యంకాని పని. తమకు హాని కల్గించే ఏ చిన్న సంఘటనకు అయినా వారు తీవ్రంగా ప్రతిస్పందిస్తుంటారు. జాతి వివక్ష అనేది చాలా దుర్మార్గమైన విషయం. అన్ని సమాజాలలో కాకపోయినప్పటికీ కొన్ని సమాజాలలో అది చాలా తీవ్రంగా ఉన్నది. మానవతకు ఎనలేని హాని చేస్తుంది. మనం ఈ దురాచారాన్ని ఏ మాత్రం ఉపేక్షించకూడదు. మనం మన ఆధిపత్య భావనలు, అధికార ఔద్ధత్యాలను వదిలివేసినప్పుడు జాతివివక్ష వైఖరుల వల్ల కలుగుతున్న అనర్థాలు అంతమవుతాయి’. వివేకవంతమైన మాటలు, సందేహం లేదు. మరి ఆ వ్యాఖ్యలు కుల, జెండర్ వివక్షలకు కూడా వర్తిస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ రెండు వివక్షలూ మన సమాజంలో చాలా విస్తృతంగా ఉన్నాయి. అపరిమితమైన హానిచేస్తున్నాయి. మన దేశంలో అగ్రకులాల పురుషులు చాలా మంది ప్రవర్తనారీతుల్లో ఆధిపత్యభావనలు, అధికార ఔద్ధత్యాలు నిండుగా కన్పిస్తాయి. ఇటువంటి ప్రవర్తనల మూలంగా మానవ హుందాకు తీవ్ర విఘాతం వాటిల్లుతోంది. మన సమాజంలో ఎల్లెడలా ఈ హాని వాటిల్లుతూనే ఉన్నది. యువకుడుగా ఉన్నప్పుడు ఎమ్‌సిసి జట్టుతో పాటు దక్షిణాఫ్రికాలో పర్యటించడానికి బ్రేయర్లేకు ఆహ్వానమందింది. ఆ ఆహ్వానాన్ని అంగీకరించి ఆయన దక్షిణాఫ్రికాకు వెళ్ళారు. అక్కడ వర్ణ వివక్ష ఎంత వికృతంగా ఉన్నదో బ్రియర్లీ మొట్టమొదటిసారి ప్రత్యక్షంగా చూశాడు. శ్వేత జాత్యహంకార ప్రభుత్వ పాలన ఆఫ్రికన్ల విషయంలో ఎంత అమానుషంగా ఉన్నదో బ్రియర్లీ స్వయంగా చూశాడు. చాలా సంవత్సరాల అనంతరం డేవిడ్ షెప్పార్డ్‌తో (ఇంగ్లాండ్ మాజీ క్రికెట్ కెప్టెన్, బిషప్, దయాశీలి, అంతరాత్మ ఆదేశాన్ని పాటించే నైతిక పౌరుడు) కలిసి జాతి వివక్ష వ్యతిరేక ఉద్యమంలో బ్రియర్లీ పాల్గొన్నాడు. దక్షిణాఫ్రికాలో పర్యటించాల్సిన ఎమ్‌సిసి టీమ్‌లో బేసిల్ డి ఒలివేరియా అనే శ్వేతజాతీయేతర క్రీడాకారుడు ఉండడంతో తమ దేశంలో పర్యటించేందుకు ఆ టీమ్‌కు దక్షిణాఫ్రికా జాత్యహంకార ప్రభుత్వం అనుమతినివ్వలేదు. ఈ అన్యా యానికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో బ్రియర్లీ చురుగ్గా పాల్గొన్నాడు. బ్రియర్లీ హీరోలలో డేవిడ్ షెప్పార్డ్ ఒకరు. ‘డేవిడ్ దయార్ద్ర హృదయుడు, ఆలోచనాశీలి. మానవులందరిలో ఉమ్మడిగా ఉండే విషయాలను ప్రజలు అర్థం చేసుకొనేందుకు డేవిడ్ తోడ్పడేవారు. ఆయన ఎల్లరికీ ప్రేమాభిమానాలు పంచుతూ ప్రతి ఒక్కరిలోని ఉత్తమ గుణాలు మరింతగా వికసించేలా, రోజువారీ జీవితంలో అవి ప్రతిబింబించేలా చేసేవారు. డేవిడ్ చాలా ఉదార వ్యక్తి’ అని బ్రియర్లీ రాశారు. మైక్ బ్రియర్లీ, డేవిడ్ షెపార్డ్ లు ఒకే విధమైన స్వభావమున్న ఉదాత్తులు. క్రికెట్ రంగంలో నైతికత, న్యాయం గురించి బ్రియర్లీ ప్రగాఢంగా ఆలోచించారు. ఇప్పుడు సజీవులుగా ఉన్న టెస్ట్ క్రికెటర్లు అందరిలోనూ మైక్ బ్రియర్లీ అత్యంత వివేకశీలి. వినయశీలి కూడా. తాను ఎంతగానో అభిమానించిన క్రీడా కారుల గురించి ఆయన ఏమి రాసారో చూడండి: ‘రోజర్ ఒక క్రాస్–కోర్ట్ ఫోర్‌హ్యాండ్ ఆడుతుండడాన్ని చూసినప్పుడు మనమంతా మినీ ఫెదరెర్లమై పోతాం. షేన్ ఒక కచ్చితమైన లెగ్–బ్రేక్‌ను బౌల్ చేసినప్పుడు మనమంతా మినీ వార్న్లమై పోతాం; గ్రెగ్ ఒక బ్యాక్ ఫుట్ స్ట్రోక్ కొట్టినప్పుడు మనం మినీ చాపెల్స్‌మై పోతాం. మనమెవ్వరమూ మనం అభిమానించే క్రికెటర్ల లాంటివారం కామని తెలుసు. అయితే అటువంటి మనస్థితిలోకి మనం ప్రవేశిస్తాం. వారి ప్రతిభా పాటవాలు మనకు మించినవని తెలిసినప్పటికీ ఒక క్షణం పాటు అటువంటి నైపుణ్యాలను ప్రదర్శించడం మనకూ సాధ్యమవుతందనే భావనతో ఆనందిస్తాం’. వివ్ రిచర్డ్స్ గానీ, షేన్ వార్న్ గానీ ఇలా రాయరు. రచనాశక్తిలేక గాదు, వారు తమ ఆటను కచ్చితంగా, పరిపూర్ణ నైపుణ్యంతో ఆడతారు. ఆట ఆడుతున్న సమయంలో తప్పులు చేయడం, విఫలమవ్వడమంటే ఏమిటో బ్రియర్లీకు బాగా తెలుసు. ఈ వైఫల్యాలు నేర్పిన పాఠాలు, మానవతాపూర్వక అవగాహన, క్రికెట్ వెలుపలి విశాలజీవితపు అనుభవాలే ఈ స్ఫూర్తిదాయక పుస్తకరచనకు బ్రియర్లీను పురిగొల్పాయి.